కోటా పెంచాల్సిందే

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ శాసనసభ చేసిన రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించేలా చొరవ చూపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. తెలంగాణ స్థానిక యువతకు ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు ఏర్పాటుచేసుకున్న నూతన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలుపాలని, హైకోర్టును వెంటనే విభజించాలని విజ్ఙప్తి చేశారు. ఈ రెండూ జరుగనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిపూర్ణం కానట్లేనని ప్రధానికి స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ర్టానికి సంబంధించిన 11 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఒక్కో అంశాన్ని వివరిస్తూ దాన్ని పరిష్కరించాల్సిన అవసరాన్ని విడమర్చి చెప్తూ ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు.

రిజర్వేషన్ల పెంపు అవసరం
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే బలహీనవర్గాల జనాభా అధికంగా ఉన్నందున.. తెలంగాణలో రిజర్వేషన్లను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీలు 7.11 శాతం ఉంటే, తెలంగాణలో 9.08 శాతం ఉన్నారని, ఉమ్మడి రాష్ట్రంలో 9.56 శాతం ముస్లింలు ఉంటే తెలంగాణలో 12.68 శాతం ఉన్నారని, బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారని అందువల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బీసీ ఈ గ్రూపులోని కులాలకు రిజర్వేషన్లను 4 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసు విషయాన్ని కూడా సీఎం ఈ భేటీలో ప్రస్తావించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని, కానీ అదే సుప్రీంకోర్టు రిజర్వేషన్లను పెంచుకోవడానికి తగిన కారణాలను చూపాలని కోరిందని సీఎం పేర్కొన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో ఎక్కువశాతం ఉన్న బలహీనవర్గాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ తెలంగాణ బ్యాక్‌వర్డ్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ (రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఆఫ్ అపాయింట్‌మెంట్ ఆర్ పోస్ట్స్ ఇన్ ద సర్వీసెస్ అండర్ ద స్టేట్) బిల్లును 2017లో ఆమోదించిన విషయాన్ని సీఎం ప్రధానికి తెలియజేశారు. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉన్నదని, ఈ విషయంలో చొరవ చూపి, తెలంగాణలో పెంచిన రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని ప్రధానిని సీఎం కోరారు.

జోనల్ వ్యవస్థను ఆమోదించండి
-తెలంగాణ రాష్ట్రంలో జరిపే ఉద్యోగ నియామకాల్లో స్థానిక యువతకు ఎక్కువ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో కొత్త జోనల్ వ్యవస్థను రూపొందించామని, దీనికి కేంద్రం అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్రంలో కొత్తగా 31 జిల్లాలను ఏర్పాటుచేసుకున్నామని, జిల్లా క్యాడర్ ఉద్యోగాల్లో స్థానికులకే 95 శాతం రిజర్వేషన్ కేటాయించామని చెప్పారు. కొత్తజిల్లాల ప్రాతిపదికన జోన్లు, మల్టీజోన్లు, స్టేట్ జోన్లు ఏర్పాటు చేసుకున్నామని, వీటికి ఆమోదం తెలుపాలని కోరారు.

హైకోర్టు విభజనతోనే తెలంగాణ ఏర్పాటు పరిపూర్ణం
-హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతున్న విషయాన్ని సీఎం కేసీఆర్.. ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు విభజన జరుగనిదే రాష్ట్ర విభజన ప్రక్రియ పరిపూర్ణం కాదని స్పష్టంచేశారు. హైకోర్టును విభజించి, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేస్తామని కేంద్రన్యాయశాఖ మంత్రి హామీ ఇచ్చారని సీఎం గుర్తుచేశారు. వెంటనే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు.

కాళేశ్వరానికి రూ.20వేల కోట్లివ్వండి
-కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి వివిధ మంత్రిత్వశాఖలు అనుమతులు ఇచ్చినందుకు ప్రధానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాధాన్యాన్ని గుర్తించి.. రూ.20 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించాలని కోరారు.

రైల్వేలైన్లు పూర్తిచేయాలి
-తెలంగాణలో కొత్త రైల్వేలైన్లు త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి వివరించారు. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్‌ను అత్యంత ప్రాధాన్యాంశంగా గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టిందని, ఈ లైన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని కోరారు. అక్కన్నపేట – మెదక్ రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ దాదాపు పూర్తయిందని, ఈ లైను నిర్మాణం పూర్తిచేయడంతోపాటు, భద్రాచలం రోడ్- సత్తుపల్లి కొత్త రైల్వేలైను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

కొత్త రైల్వేలైన్లు మంజూరుచేయాలి
-కాజీపేట- విజయవాడ మధ్య విద్యుదీకరణతో కూడిన మూడో లైన్ నిర్మాణం, రాఘవాపురం- మందమర్రి మధ్య మూడో లైన్, ఆర్మూర్- నిర్మల్- ఆదిలాబాద్ మధ్య బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని కోరారు. సికింద్రాబాద్- మహబూబ్‌నగర్, సికింద్రాబాద్- జహీరాబాద్ రైల్వేలైన్లను డబుల్ లేన్‌గా మార్చడానికి, హుజూరాబాద్ మీదుగా కాజీపేట, కరీంనగర్ మధ్య రైల్వేలైన్ నిర్మించడానికి అవసరమైన సర్వే నిర్వహించాలన్నారు.

బైసన్‌పోలో స్థలాన్నివ్వండి
-హైదరాబాద్‌లో కొత్త సచివాలయం నిర్మించడానికి బైసన్‌పోలో గ్రౌండ్ స్థలాన్ని కేటాయించాలని సీఎం కేసీఆర్ కోరారు. 44వ నంబర్ జాతీయ రహదారి, 1వ నంబర్ స్టేట్ హైవేను విస్తరించడానికి అనుగుణంగా తమ ఆధీనంలోని స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి రక్షణశాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని గుర్తుచేశారు. ఆ భూములను కూడా వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అనువుగా రహదారులను విస్తరించడం సాధ్యమవుతుందన్నారు. ఈ మూడు ప్రాంతాల్లోని రక్షణశాఖ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి కోరారు.

వెనుకబడిన జిల్లాలకు నిధులివ్వండి
-విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాలు (ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ. 50 కోట్ల చొప్పున రూ. 450 కోట్ల సాయం అందించాల్సి ఉండగా, 2017-18కు నాలుగో విడుత ఆర్థికసాయం ఇం కా విడుదల కాలేదని సీఎం కేసీఆర్, ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఈ నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరారు.

ఐఐఎం ఇవ్వండి
-తెలంగాణ రాష్ర్టానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. దీంతోపాటు 2013లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేసిందని, ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిందని ప్రధానికి తెలిపారు. కానీ, హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం ఉపసంహరించుకొన్నట్లుగా కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ పేర్కొన్నట్లు పత్రికల్లో చదివామన్న సీఎం కేసీఆర్.. ఐదేండ్ల క్రితం మంజూరు చేసిన ప్రాజెక్టును ఉపసంహరించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటుందన్నారు. ఈ ప్రాజెక్టుకోసం నిధులిచ్చి హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌కు చేయూతనందించాలని ముఖ్యమంత్రి కోరారు.

కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ ఇవ్వాలి
-కరీంనగర్ పట్టణంలో ఐఐఐటీ ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ కోరారు. దీనికి సంబంధించిన స్థలం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాని మోదీకి తెలిపారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో సాంకేతిక విద్యావకాశాలను పెంపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం వివరించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు సాంకేతిక విద్యాసంస్థలున్నాయని, వరంగల్‌లో నిట్ ఉందని, కరీంనగర్‌లో ఐఐఐటీ స్థాపించడం వల్ల సాంకేతిక విద్యా సంస్థలను జిల్లా కేంద్రాలకు మరింత విస్తరించినట్లు అవుతుందని సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీకి తెలిపారు.

జిల్లాకో నవోదయ విద్యాలయం స్థాపించాలి
ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధానంగా పెట్టుకున్నదని, దాని ప్రకారం తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని సీఎం కోరారు. రంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలున్నాయన్నారు. మిగతా 21 జిల్లాలయిన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కూడా నవోదయ విద్యాసంస్థలను నెలకొల్పాలని కోరారు. ఈ విద్యాలయాలకు కావాల్సిన స్థలం, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం కేసీఆర్.. ప్రధానికి మోదీకి తెలిపారు.

సీఎం విజ్ఞప్తులపై ప్రధాని హామీ ఇచ్చారు
-ఎంపీ వినోద్ కుమార్
తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారని, ఈ భేటీలో రాష్ర్టానికి సంబంధించిన చాలా అంశాలు చర్చించారని ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానితో గంటపాటు సాగిన భేటీలో నూతన జోనల్ విధానం, విభజన హామీలపై సీఎం కేసీఆర్ చర్చించారని తెలిపారు. నూతన జోనల్ విధానంతో 95 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు ఉన్నాయని, పెండింగ్ అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థికసాయం హామీలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని, వచ్చే క్యాబినెట్ సమావేశంలో అన్ని అంశాలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌కు.. ప్రధాని హామీ ఇచ్చారని ఎంపీ వినోద్ తెలిపారు.

error: