తల్లి పాలే ముద్దు

పుట్టినబిడ్డకు తల్లి నుంచి మొదటి గంటలో వచ్చే పాలే అన్నివిధాల శ్రేయస్కరమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాలను మంత్రి హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి.. తల్లులు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు, వైద్య సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. మొదటిగంటలో తల్లి నుండి వచ్చే పాలను తాగుతున్న చిన్నారులు దేశంలో 41 శాతమే ఉన్నారని చెప్పారు. ప్రపంచంలో తల్లిపాలకు ప్రత్నామ్నాయం లేదని, అత్యంత విలువైనవి, విశిష్టమైనవి తల్లి పాలు అని అన్నారు. గర్భిణులు దవాఖానకు వచ్చే మొదటి పరీక్షల సమయం నుంచి తల్లి పాల ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, వైద్యులు వారికి వివరించాలని సూచించారు.

రాష్ట్రంలో సిజేరియన్లు తగ్గించే ప్రయత్నంలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. తల్లి పాల ఆవశ్యకతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని నిలోఫర్‌ దవాఖానలో, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో తల్లి పాల బ్యాంకులను ఏర్పాటు చేసిందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని చెప్పారు. సిద్దిపేట బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన తల్లి పాలు ఇచ్చే గదిని బాగా వినియోగించుకుంటున్నారని, అన్ని కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తల్లిపాల సొసైటీ, రోటరీ క్లబ్‌, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 500 మంది తల్లులు పాల్గొనగా, ఈ కార్యక్రమాన్ని రికార్డుగా ఇండియా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ నమోదు చేసింది. రికార్డు నమోదు చేసిన పత్రాన్ని మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా తల్లిపాల సొసైటీ వారికి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌ హుస్సేన్‌, డాక్టర్‌ యాదవరెడ్డి, టూరిజం చైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

error: