జనవరి నాలుగవ వారంలో ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ సిద్ధమౌతోంది.దీనికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర సహకార రిజిస్టర్ శాఖ సిద్ధం చేసింది.ఇప్పటికే అన్ని జిల్లాల సహకార శాఖ అధికారులకు రిజిస్టార్,కమిషనర్ ఎం.వీరబ్రహ్మయ్య స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు.ప్రాథమిక సహాకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని అందులో పేర్కొన్నారు.ఫ్యాక్స్ లలో ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం ముద్రించాలని,వాటిపై అభ్యంతరాలు,విజ్ఞప్తులను ఈ నెల 21 వరకు స్వీకరించాలని పేర్కొన్నారు.పర్సన్ ఇంచార్జి కమిటీ వాటన్నింటిని పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను ఈ నెల 22 న ప్రచురించాల్సి ఉంది.జాబితాను ఈ నెల 23 న సహకార శాఖ రిజిస్టార్ ఆమోదానికి పంపాలి.