ఉప ఎన్నికల షెడ్యూలు కూడా రాకముందే దుబ్బాకలో ఎన్నికల వేడి మొదలైంది. నియోజకవర్గంలో అప్పుడే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. మండలానికి ఒక్కరు ఇంచార్జీ బాధ్యతలు తీసుకుని పార్టీ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇంతకాలం హోం క్వారంటైన్లో ఉన్న మంత్రి హరీశ్ రావుకు టెస్టింగ్ లో కరోనా నెగిటివ్ రావడంతో ఆయన త్వరలో నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇక చాలా రోజులుగా బీజేపీ ప్రచారం చేస్తోంది. స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థి కోసం వెతుకుతోంది. నియోజకవర్గంలో ఓటు బ్యాంకు ఉన్నా సరైన లీడర్ లేకపోవడం పెద్ద సవాలుగా మారింది.
టీఆర్ఎస్ కు అసంతృప్తే ప్రత్యర్థి
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో దుబ్బాకలో ఎన్నికల వేడి మొదలైంది. పక్షం రోజులుగా టీఆర్ఎస్, బీజేపీలు క్షేత్ర స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ కేడర్ ను సమాయత్తం చేస్తున్నాయి. అయితే కేడర్లో ఉన్న అసంతృప్తి టీఆర్ఎస్ కి పెద్ద సవాలుగా మారింది. సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వాలనే పార్టీ నిర్ణయంపై మెజార్టీ కేడర్ వ్యతిరేకిస్తోందని తెలిసింది. రామలింగారెడ్డి కొద్దిమందికే ప్రియార్టీ ఇచ్చారని, మళ్లీ ఆ కుటుంబానికి ఎందుకు సహకరించాలని కొందరు లీడర్లు రహస్యంగా మీటింగ్ పెట్టుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి హరీశ్ రావు అసంతృప్తులను బుజ్జగించేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎమ్మెల్యేలను రంగంలోకి దింపారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కో మండలం బాధ్యతలు ఇచ్చారు. వీరు గ్రామాలకు వెళ్లి అసమ్మతి నేతలతో మాట్లాడుతున్నారు. కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే, మరికొందరు మాత్రం పార్టీ తమకు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. దీంతో కేడర్ ఎటువైపున ఉందోనని అయోమయం టీఆర్ఎస్ లీడర్లలో నెలకొంది. పక్కనే ఉన్న గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి ఇక్కడ ఎందుకు చేయలేదని నిలదీస్తున్నట్టు లీడర్లు అంటున్నారు.
రామలింగారెడ్డి భార్యకు టికెట్
రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముందుగా సోలిపేట కొడుకు సతీష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అనుకున్నట్టు ప్రచారం జరిగింది. కాని బీజేపీ అభ్యర్థి రఘునందన్ తో పోటీ పడే శక్తి సతీష్‌కు లేదనే కారణంతో ఆ ఆలోచన విరమించుకుని, సుజాతకు టికెట్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆమెకు టికెట్ ఇస్తే మహిళల నుంచి సానుభూతి కలిసి వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎలక్షన్ ముందు పార్టీలోకి వచ్చినా తమకు ప్రయార్టీ దక్కలేదని, ఈసారి టికెట్ ఇవ్వాలని ఆయన మంత్రి హరీశ్ ను కలిసి కోరినట్టు తెలిసింది.
ఓటర్లు ఉన్నా క్యాండిడేట్ లేని కాంగ్రెస్
దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. కాని పోటీ చేసే అభ్యర్థుల కోసం ఆన్వేషణ చేస్తోంది. పెద్దగా రాజకీయ అనుభవం లేని నాగేశ్వరర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే 2వ స్థానంలో నిలిచారు. ఈ సారి కూడా కాంగ్రెస్ కు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చే చాన్స్ ఉంది. అయితే సరైన అభ్యర్థి మాత్రం దొరకడం లేదు. టీఆర్ఎస్ లో ఉన్న ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి ని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే ఆలోచనలో పీసీసీ నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
టీఆర్ఎస్ అసమ్మతిపైనే బీజేపీ గురి
టీఆర్ఎస్ లో ఉన్న అసమ్మతి నేతలపై బీజేపీ గురిపెట్టింది. వారి సహకారం కోసం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రామలింగారెడ్డి కుటుంబంపై వ్యతిరేకంగా ఉన్న టీఆర్ఎస్ లీడర్లు బీజేపీకి సపోర్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. వరసగా ఓడిపోయిన సానుభూతి తనకు కలిసి వస్తుందని ధీమాలో రఘునందన్ ఉన్నారు. స్థానిక యూత్ కూడా బీజేపీకి మద్దతుగా నిలుస్తోందని చర్చ జరుగుతోంది.