పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడి సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పింగ్లిష్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది ముదాసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ హతమయ్యాడు.
ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతాసిబ్బంది కార్డన్ సెర్చ్ చేపట్టారు. తనిఖీలు జరుపుతుండగా ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు భద్రతాబలగాలపైకి కాల్పులకు దిగారు. దీంతో ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు జైషే ఉగ్రవాదులను మట్టుబెట్టారు జవాన్లు.
ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయని అధికారులు తెలిపారు. హతుల్లో ఒకరిని ముదాసిర్ అహ్మద్ ఖాన్‌గా గుర్తించారు పోలీసులు. గత నెలలో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి అహ్మద్ కీలక సూత్రధారిగా వ్యవహరించాడు.