ప్రతి తరగతికీ ఓ చానల్
📚ఆన్‌లైన్ చదువుకు ‘ప్రధాని ఈ-విద్య’ కార్యక్రమం
ఉపాధి హామీ పథకానికి రూ.40 వేల కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ, ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించేందుకు ‘ప్రధాని ఈ-విద్య’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రతి ఒక్క తరగతికీ ఒక చానల్‌ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా ఆమె ఆదివారం చివరి విడుత కేటాయింపుల వివరాలను వెల్లడించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.40 వేల కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రజారోగ్య రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
ఆన్‌లైన్ కోర్సులకు 100 వర్సిటీలకు అనుమతి
ఇంటర్నెట్ వసతి లేని విద్యార్థులకు చేరువయ్యేందుకు స్వయం ప్రభ డీటీహెచ్ చానెళ్లద్వారా విద్యాబోధన అందించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు చానళ్లతోపాటు పాఠశాల విద్య కోసం అదనంగా మరో 12 చానళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయమై ప్రైవేట్ డీటీహెచ్ ఆపరేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు. డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించేందుకు పీఎం ఈ-విద్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మే 30 నాటికల్లా ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభించేందుకు టాప్ 100 యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు