ముస్లిం మహిళల విడాకులకు సంబంధించి మంగళవారం కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. భర్త నుంచి విడాకులు కావాలని కోరే హక్కును ఇస్లామిక్ చట్టం గుర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. భర్త అంగీకారం లేకున్నా ఆ మహిళ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని కోర్టు వెల్లడించింది. ఆ మహిళలకు భరణం ఇవ్వాలని కూడా కోర్టు పేర్కొన్నది. జస్టిస్ మహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సీఎస్ డయాస్‌లతో కూడిన ధర్మాసనం ఓ కేసులో ఈ తీర్పును ఇచ్చింది. భర్త అంగీకరించకున్నా కులా విధానాన్ని అమలు చేయవచ్చు అని కోర్టు ఈ తీర్పులో తెలిపింది. ఓ కేసులో 59 పేజీల తీర్పును ధర్మాసనం వినిపించింది. ముస్లిం మహిళ ఎప్పుడైనా తన వివాహ బంధాన్ని బ్రేక్ చేయవచ్చు అని, పవిత్ర ఖురాన్ కూడా ఈ విధానాన్ని అంగీకరిస్తుందని, భర్త అంగీకారం ఉన్నా లేకున్నా విడాకులు తీసుకోవచ్చు అని కోర్టు తెలిపింది.