Hyderabad: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ జాబ్ రాకెట్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేశారు. పంజాగుట్టలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్‌ల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిపి సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ కాల్ సెంటర్‌పై దాడి చేశారు. నకిలీ కాల్ సెంటర్ నడపడంతో పాటు డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు
కాల్ సెంటర్ నిర్వాహకులైన చక్రధర్, గణేష్, శ్రావణ్‌తో పాటు కాల్ సెంటర్లో పనిచేస్తున్న 32 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 11 మంది మహిళలు కూడా ఉన్నారు. గడగోని చక్రధర్ గౌడ్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ బాచుపల్లిలోని ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నాడు. సిద్దిపేట డిగ్రీ కాలేజీలో బీకాం పూర్తి చేసిన అతడు.. ఆ తర్వాత ఆబిడ్స్‌లో ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేశాడు. అలాగే హిమాయత్ నగర్లో కోటక్ మహీంద్రా బ్యాంకులో కూడా ఉద్యోగం చేశాడు.
ఒక సంవత్సరం పాటు సాకేత్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా చక్రధర్ గౌడ్ పనిచేశాడు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి డేటా ఎంట్రీ జాబ్‌ల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇందుకోసం పంజాగుట్టలో నెలకు రూ.లక్ష 30 వేలతో ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. అందులో ఒక నకిలీ కాల్ సెంటర్ ప్రారంభించి టెలీకాలర్స్‌ను తీసుకున్నాడు. అనంతపురంలోని కృష్ణమూర్తి నుండి సిమ్ కార్డులను తీసుకుని వివిధ ఫోన్లలో వేశాడు. ఈ ఫోన్లతో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులోని నిరుద్యోగ యువతకు ఫోన్ చేసి డేటా ఎంట్రీ జాబ్‌లు ఉన్నాయని నమ్మించేవారు.
నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు శాలరీ ఉంటుందంటూ మాయ మాటలు చెబుతారు. వీరి మాయమాటలు నమ్మి చాలామంది నిరుద్యోగులు వలలో చిక్కుకున్నారు. ఉద్యోగం కోసమని డబ్బులు చెల్లించారు. ఇలా చాలామంది నిరుద్యోగుల నుంచి కాల్ సెంటర్ నిర్వాహకులు డబ్బులు వసూలు చేసేవారు. మోసపోయిన యువకులు తమను గుర్తించకుండా ఉండేందుకు 45 రోజులకు ఒకసారి సిమ్ కార్డులను మారుస్తూ ఉండేవారు. ఏప్రిల్ నెలలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువత నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారు. పోలీసులకు ఈ నకిలీ కాల్ సెంటర్ గురించి సమాచారం తెలియడంతో దాడి చేశారు. నిందితుల వద్ద నుంచి 14 ల్యాప్‌టాప్‌లు, 148 మొబైల్ ఫోన్స్, 1,03,500 నగదు, ఒక కారు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.