వణుకుతున్న చేయి.. వాడుతున్న కమలం

‘పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టినట్టు’గా ఉన్నది రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్‌ నేతల తీరు. ప్రజల గుండెల్లో ఇప్పటికే సుస్థిర స్థానం సంపాదించుకున్న బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ దిశగా పరుగులు పెడుతుండగా.. కాంగ్రెస్‌, బీజేపీలు తమ పరిస్థితి ఏంటో అర్థంకాక అయోమయానికి గురవుతున్నాయి. ‘తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేకు పిచ్చిలేసింది. విజయశాంతితో చర్చలని లీకేజీలిస్తూ, అవాస్తవాలను మాట్లాడటం పిచ్చివాగుడు అవుతుంది’ అని విజయశాంతి ట్వీట్‌ చేశారు. ‘బీజేపీ నుంచి ఒకరు వేరే పార్టీకి వెళ్తారు. ఒకరిద్దరు బీజేపీలో చేరడం లేదు. బీజేపీలో ఒకరిద్దరికి పదవులు కేటాయింపు చాలా పెద్ద సమస్య’ అని మరో ట్వీట్‌ చేసి పార్టీలోని అయోమయ పరిస్థితిని కండ్లకు కట్టారు.

ఇంకోవైపు, కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందని గతంలో చెప్పుకొచ్చిన ఆయన భవిష్యత్తు ఏంటో అర్థంకాక ఇప్పుడు అయోమయ స్థితిలో ఉన్నారు. శనివారం ఆయన చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తున్నదని అంటూనే.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చినట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. మరోవైపు, ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమానికి దూరంగా ఉన్న ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డితోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఢిల్లీ రావాలంటూ జేపీ నడ్డా నుంచి పిలుపు రావడం రాష్ట్ర బీజేపీలో చర్చకు కారణమైంది.
కర్ణాటక ఎన్నికల ముందు వరకు రాష్ట్రంలో తలెగరేసిన ఇక్కడి బీజేపీ నేతలు.. అక్కడ కాషాయ పార్టీ అడ్రస్‌ గల్లంతు కావడంతో నైరాశ్యంలో మునిగిపోయారు. ఒకవేళ అక్కడ కమలం పార్టీ గెలిచి ఉంటే ఇక్కడ కూడా అధికారం తమదేనని హల్‌చల్‌ చేయాలని భావించిన నేతలు ఇప్పుడు ప్రజల ముందుకు రావడానికి జంకుతున్నారు. బీజేపీతో ఇక లాభం లేదని భావించి తలోదారి చూసుకుంటున్నారు. ఈ పరిణామాలు గమనించే పార్టీ చీఫ్‌ నడ్డా.. కిషన్‌రెడ్డి, ఈటల, కోమటిరెడ్డిని ఢిల్లీకి పిలిచారు. పార్టీ రాష్ట్ర చీఫ్‌ను అయిన తనకు ఆహ్వానం అందకపోవడంపై బండి సంజయ్‌ షాకైనట్టు తెలుస్తున్నది. ఇంచుమించు బీజేపీ పరిస్థితే రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ ఉంది. ఈ పార్టీలో ఎవరికి వారే గ్రూపులు మెయింటెన్‌ చేస్తుండడం అధిష్ఠానాన్ని కలవరపరుస్తున్నది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా గ్రూపులు చాలానే తయారయ్యాయి. సీఎం సీటును ఆశించకుండా పనిచేయడానికి తాను సన్యానిసి కాదన్న రేవంత్‌ వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క వర్గం అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చింది. భట్టికి అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఇప్పటికే గ్రూపులతో సతమతవుతున్న కాంగ్రెస్‌కు షర్మిల వ్యవహారం కొత్త తలనొప్పిగా మారింది.
బీజేపీలో ఇప్పుడు కాంగ్రెస్‌ను మించిన గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయి. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే తప్ప భవిష్యత్తు ఉండదని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. బండిని తప్పిస్తే సీనియర్లకే ఆ పదవి ఇవ్వాలని, లేదంటే అంగీకరించే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంట్లో సమావేశమైన నేతలు అధిష్ఠానం పెద్దలకు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటాయి. ఈ ఉత్సవాలకు ప్రజల్లో లభించిన ఆదరణ చూస్తేంటే కేసీఆర్‌ మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అని తేలిపోయింది. 9 ఏండ్ల కాలంలోనే రాష్ర్టాన్ని అగ్రపథాన నిలిపి, దేశానికి రోల్‌మాడల్‌గా నిలిపిన బీఆర్‌ఎస్‌కు మరోమారు పట్టం కట్టేందుకు ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్‌లో విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా శనివారం సూర్యాపేటలో ఆ పార్టీ నేతలు తోపులాటకు దిగారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమేశ్‌రెడ్డి వర్గీయులు తోపులాటకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. నల్లగొండ జిల్లాలో యాత్ర పూర్తి చేసుకొని శనివారం భీమారం మీదుగా సూర్యాపేట జిల్లాకు చేరుకున్న భట్టికి దామోదర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి భీమారం బ్రిడ్జి వద్ద స్వాగతం పలికారు. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని కుసుమవారిగూడెం వద్ద పటేల్‌ రమేశ్‌రెడ్డి తన వర్గంతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రమేశ్‌రెడ్డి వర్గం ఉన్నచోటకు పాదయాత్ర చేరుకోగా, అక్కడ భట్టికి గజమాల వేసే సందర్భంలో రెండు గ్రూపుల మధ్య తోపులాట జరిగింది.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుయాష్కీగౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరాలనుకున్న వారిపై ఎంక్వైరీ చేయిస్తామని, వారొచ్చేది పార్టీ కోసమే, వ్యాపారం కోసమా? అనేది తేలుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌, ఈటలను ఉద్దేశించే ఆయనీ వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు.

 

error: