అది దేశంలోనే అతి పొడవైన ఫ్లై ఓవర్.. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన రహదారి.. మొత్తం 11.633 కిలోమీటర్ల దూరం.. కానీ, ఇప్పుడు పగుళ్లతో ప్రమాదకరంగా మారింది. మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడి ఓ యువతి మీద పడడంతో ఆమె మృతి చెందిన ఘటన మరువకముందే .. హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా మారిన పీవీ ఎక్స్ప్రెస్ వే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మెహిదీపట్నం నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా కట్టిన ఈ ఫ్లై ఓవర్పై ఓ పిల్లర్ పగుళ్లకు గురైంది. పిల్లర్ నంబర్ 20 వద్ద జాయింట్లు కొన్ని పగిలి.. ఫ్లై ఓవర్ పై నుంచి వెళ్లే వాహనదారులను, కింది నుంచి వెళ్లే వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఏ క్షణంలో కూలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇటీవలే ఫ్లై ఓవర్పై గుంతలు ఉన్నాయంటూ రిపేర్లు చేపట్టినట్లు సమాచారం.