కరోనా ప్రభావం మగాళ్లపైనే ఎక్కువగా కనిపిస్తోంది. వైరస్ బారిన పడుతున్న వారిలో ప్రతి 100 మంది పేషెంట్లలో 66 మంది పురుషులే ఉంటున్నారు. 34 మంది ఫిమేల్స్ ఉంటున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ లో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా కూడా కొంచెం ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో
సోమవారం నాటికి 57,142 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 37,486 మంది మేల్స్ ఉన్నారు. మరో 19,656 మంది ఫిమేల్స్ కరోనా బారినపడ్డారు. తమ కుటుంబంలోని పురుషుల వల్లే మహిళల్లో సగం మందికి పైగా కరోనా సోకడం గమనార్హం.
ఎక్కువ మంది యంగ్ ఏజ్ వాళ్లే
కరోనా ప్రభావం పదేళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటిన వృద్ధులపైనే ఎక్కువగా ఉంటుందని మొదట్లో డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. కానీ తర్వాత పరిస్థితి మారింది. రాష్ట్రంలో వైరస్ బారినపడిన వాళ్లలో ఎక్కువ మంది యంగ్ ఏజ్ లో ఉన్నవాళ్లే సగానికి పైగా ఉన్నారు. వయసుల వారీగా చూస్తే.. పదేళ్ల లోపు చిన్నారులు 1,942 మంది, 11 నుంచి 20 ఏళ్ల లోపు వారు 3.028 మంది, 21 నుంచి 30 ఏళ్ల లోపు వారు
12,628 మంది, 31 నుంచి 40 ఏళ్ల లోపు వారు 14,286 మంది, 41 నుంచి 50 ఏళ్ల లోపు వారు 10,629 మంది, 51 నుంచి 60 ఏళ్ల లోపు వారు 8,400 మంది, 61 నుంచి 70 ఏళ్ల లోపు వారు 4,400 మంది, 71 నుంచి 80 ఏళ్ల లోపు వారు 1,485 మంది, 81 ఏళ్లపై బడిన వారు 344 మంది ఉన్నారు. దీన్ని బట్టి వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు, పనుల కోసం బయట తిరిగే 21 నుంచి 50 ఏళ్ల లోపువారే కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.
300 మందికిపైగా మగవాళ్లే
రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోతున్న వారిలోనూ పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం సోమవారం నాటికి కరోనా డెత్స్ 480. ఇందులో 300 మందికిపైగా పురుషులే ఉన్నట్లు తెలిసింది. ‘‘కరోనా విషయంలో వృద్ధులకు ఎంత ముప్పు ఉందో.. పురుషులకూ అంతే ముప్పు ఉంది’’ జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైంటిస్ట్ సబ్రా క్లీన్ ఈ మధ్య వెల్లడించారు. వైరల్ ఇన్‌ఫెక్షన్లలో జెండర్ డిఫరెన్స్ పై ఈయన స్టడీ చేస్తున్నారు. మహిళల్లో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రాణహాని తక్కువగా ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. పురుషులకు మద్యం, సిగరెట్ తాగే అలవాట్లు ఉండడం, బీపీ, షుగర్, హార్ట్ వ్యాధులు ఉండటం వల్ల త్వరగా కరోనా బారిన పడుతున్నారు. స్త్రీలల్లో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండటంవల్ల వారు కరోనాను ఎదుర్కో గలుగుతున్నారని.. మగాళ్లకు ఒక ఎక్స్
క్రోమోజోమ్, ఒక వై క్రోమోజోమ్ ఉండటం వల్ల వైరస్ ను ఎదుర్కోలేక ఎక్కువగా చనిపోతున్నారని కొందరు సైంటిస్టుల రీసెర్చ్ లలో తేలింది.