కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలను కుదిపేసింది. ఇందులో ఐటీ మినహాయింపేం కాదు. ఐటీ ఇండస్ట్రీ కుదేలవుతున్న సమయంలో ఇండియన్ ఇండస్ట్రీ నిలదొక్కుకుంది. ప్లేస్మెంట్లు, అపాయింట్మెంట్లు కరువై నిరుద్యోగులు పెరిగిపోతున్న సమయంలో మళ్లీ పుంజుకుని లక్షా 40వేల ఉద్యోగాలకు పచ్చ జెండా ఊపింది.
ప్రపంచ ఐటీ రంగం 3.2 శాతం మేర కుదేలవుతుందనే అంచనాల నడుమ ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియన్ ఐటీ పరిశ్రమ 2.3 శాతం వృద్ధి రేటు కనబరిచి సత్తా చాటనున్నట్లు నాస్కామ్ అంచనా వేసింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సెకండాఫ్‌లో రికవరీతో ఐటీ రంగం సానుకూల వృద్ధిని సాధిస్తుందని నాస్కామ్ ‘న్యూ వరల్డ్ : ద ఫ్యూచర్ ఈజ్ వర్చువల్’ టైటిల్‌తో వెల్లడించిన రివ్యూలో వివరించింది.
2021 ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ రంగ ఆదాయం దాదాపు రూ.13 లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెండు శాతం అధికం. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షా 38వేలు కొత్త ఐటీ కొలువులు వచ్చి చేరతాయని అంచనా వేసింది. 2020 క్యాలెండర్ సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తితో కష్టాలతో మొదలై పలు కంపెనీలకు రేట్లు, కాంట్రాక్టులపై ఒత్తిళ్లు పెరిగినా 2021 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో భారీ రికవరీతో ఐటీ రంగం పుంజుకుందని నాస్కామ్ పేర్కొంది.
భారత ఐటీ పరిశ్రమ కరోనా మహమ్మారితో కుదేలై ఇప్పట్లో కోలుకోలేదన్న విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా ఇండియా కోలుకుందని తెలిపింది.
Tags carona virus INDIA jobs Software