దేశవ్యాప్తంగా 83వేల కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల అభివృద్ధికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ మాల ప్రాజెక్ట్ లో హైదరాబాద్- పనాజీ మధ్య కారిడార్ సహా మూడు కారిడార్లు తెలంగాణకు మంజూరయ్యాయి.
భారత్ మాల ప్రాజెక్టులో తెలంగాణలో దాదాపు 356 కిలోమీటర్ల మేర కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో మొదటిది నార్కట్‌పల్లి నుంచి పొందుగుల వరకు 98 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. నార్కట్‌పల్లి నుంచి నల్లగొండ, తిప్పర్తి, మిర్యాలగూడ, కొండప్రోలు, పొందుగుల వరకు ఈ కారిడార్ నిర్మించనున్నారు. దీనికి ఆర్‌అండ్‌బీ అధికారులు డీపీఆర్ తయారు చేస్తున్నారు. అలాగే రెండో కారిడార్ హైదరాబాద్ నుంచి పనాజీ వరకు నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో జడ్చర్ల నుంచి కర్ణాటక సరిహద్దైన ధర్మజ్ఞపూర్ వరకు 109 కిలోమీటర్ల రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ను తయారు చేస్తున్నది. మూడవ కారిడార్‌ను ఆర్మూర్- జగిత్యాల- రామగుండం మధ్య నిర్మించనున్నారు. 49 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ కు సైతం రాష్ట్ర ప్రభుత్వమే డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నది.
ఇక 6.9 లక్షల కోట్ల పెట్టుబడితో 2022 నాటికి భారత్ మాల ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతకుముందు 50వేల కిలోమీటర్లను అభివృద్ధి చేసిన జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు తరువాత రెండో అతిపెద్ద రహదారుల ప్రాజెక్టుగా భారత్ మాలను పేర్కొంటున్నారు