ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు ప్యాపిలి సమీపంలోని చిరుతల గుట్ట వద్ద ముందు వెళుతున్న సిమెంటు లారీని ఢీకొంది. అదుపుతప్పి డివైడర్ దాటి గుట్టను ఢీకొంది. ఈ ప్రమాదంలో చత్తీస్‌ఘడ్‌కు చెందిన సురేష్ కుమార్(20), చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్(29) మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
కర్నూలు జిల్లా ప్యాపిలి సమీపంలో జబ్బార్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి 44పై ముందు వెళుతున్న సిమెంటు లారీని బలంగా ఢీకొని.. అదుపు తప్పి చిరుతల గుట్టను ఢీకొంది. ఈ ఘటనలో చత్తీస్‌ఘడ్‌కు చెందిన సురేష్ కుమార్(20), చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్(29) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే ఎస్‌ఐ మారుతి శంకర్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పరారైనట్లు ఎస్‌ఐ తెలిపారు. కర్ణాటకకు చెందిన కేఏ 01 ఏజే 0322 నెంబరు గల బస్సు బెంగళూరు నుంచి గురువారం రాత్రి 11 గంటలకు హైదరాబాదుకు బయలు దేరింది.
బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారు జామున 4 గంటలకు ప్యాపిలి సమీపంలోని చిరుతలగుట్ట వద్దకు రాగానే బస్సు ముందు వెళుతున్న సిమెంటు లారీని బలంగా ఢీ కొట్టింది. అదుపు తప్పి డివైడర్ దాటి కుడి వైపున ఉన్న గుట్టను ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో మృతి చెందిన విశ్వనాథ్ చిత్తూరు జిల్లా చంద్రమాకుల గ్రామానికి చెందినవారు. సురేష్ కుమార్‌ది చత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడ జిల్లా. చత్తీస్‌ఘడ్‌కి చెందిన మనోజ్ కుమార్, హైదరాబాదుకు చెందిన మనోహర్ గాయపడ్డారు. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు, అతి వేగమే ప్రమాదానికి కారణ మని ఆయన తెలిపారు.
భార్య పరీక్ష కోసం..
చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్ ఇంటీరియర్ వ్యాపారం చేస్తూ బెంగళూ రులోనే నివాసం ఉంటున్నారు. ఆయన భార్య దుర్గాలక్ష్మి శుక్రవారం కర్నూలులో నర్సింగ్ పరిక్షలు రాయాల్సి ఉంది. దీంతో దంపతులు ఇద్దరూ బెంగళూరులో జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఎక్కారు. ప్రమాదంలో భర్త మృతి చెం దడంతో దుర్గాలక్ష్మి బోరున విలపించింది. ఇక తనకు దిక్కెవరని, ఎవరికోసం బత కాలని ఆమె ఘటనా స్థలం వద్ద కన్నీరుమున్నీరయ్యారు.
స్నేహితుడి మృతి..
చత్తీస్‌ఘడ్‌కి చెందిన సురేష్ కుమార్, మనోజ్ కుమార్ మంచి స్నేహితులు. ఐదేళ్ళుగా బెంగళూరులోని ఓ బోర్‌వెల్స్ సంస్థలో పనిచేస్తున్నారు. హైద రాబాద్ వెళ్ళెందుకు బెంగళూరులో ట్రావెల్స్ బస్సు ఎక్కారు. ప్రమాదంలో సురేష్ కుమార్ మృతి చెందాడు. మనోజ్ కుమార్‌కు గాయా లయ్యాయి. ప్రమాదంలో స్నేహితుడు మృతి చెందడంతో మనోజ్ కుమార్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
జబ్బారు ట్రావెల్స్‌పై కేసు నమోదు
బెంగళూరు జబ్బారు ట్రావెల్స్‌కు చెందిన బస్సు తన లారీని వెనుకవైపు బాగంలో బలంగా ఢీకొనిందని డ్రైవర్ శ్రీనివాసులు ఎస్‌ఐ మారుతీశంకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనివల్ల లారీ దెబ్బతినిందని తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులు కూడా మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మృత్యువుతో పోరాటం
చత్తీస్‌ఘడ్‌కు చెందిన సురేష్ కుమార్ బస్సు ప్రమాదంలో శకలాల మధ్య ఇరుక్క పోయాడు. కొనఊపిరితో దాదాపు 2 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. అతన్ని బయ టకు తీసేందుకు తోటి ప్రయాణికులు యత్నించి విఫలమయ్యారు. అనంతరం పోలీసులు, సహాయక సిబ్బంది ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు క్రేన్ సాయంతో బయటికి తీశారు. కానీ అతని ప్రాణాలు నిలపలేక పోయారు.
తప్పిన మరో ప్రమాదం
జబ్బారు ట్రావెల్స్ బస్సు లారీని బలంగా ఢీ కొట్టి డివైడర్ దాటింది. ఆ సమయంలో అనంతపురం నుంచి కర్నూలు వైపు మరో ట్రావెల్స్ బస్సు వేగంగా వెళుతోంది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై బ్రేకు వేయడంతో మరో ప్రమాదం తప్పిపోయిందని లారీ డ్రైవర్ శ్రీనివాసులు తెలిపారు.
బలంగా ఢీకొంది..
లారీని వెనుక బస్సు బలంగా ఢీ కొట్టింది. దీంతో లారీ రోడ్డు పక్కకు వెళ్ళిపోయింది. ఏం జరిగిందోనని దిగి చూశాను. బస్సు డివైడర్ దాటి గుట్టను ఢీకొట్టి ఆగిపోయింది. వెంటనే పోలీసులకు, హైవే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చాను. అప్పటికే బస్సు డ్రైవర్ పరారయ్యాడు.
Tags Accident andrapradesh hyderabad telangana