మూగజీవాలపై కొందరికి ఎనలేని ప్రేమ ఉంటుంది. తాము చనిపోతే వాటి ఆలనాపాలనా చూసేందుకు కొందరు తమ ఆస్తిలో కొంత భాగాన్ని వాటి పేరున రాసిన ఘటనలను విదేశాల్లో చూశాం. ఇక అన్నిజంతువుల్లో కెల్లా విశ్వాసం గల జంతువు కుక్క. అలాంటి కుక్కను ఇంట్లో కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంటారు. వాటికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను కూడా వేడుకగా నిర్వహిస్తుంటారు.
అయితే కుక్కకు శ్రీమంతం జరిపించడం ఎప్పుడైనా చూశారా..?
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న సత్తుపల్లి పట్టణం అలాంటి వింత ఘటనకు వేదికైంది.సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నవ కుమార్, ఆశా దంపతులు నివాసం ఉంటున్నారు. వారు ఏడాది కిందట ఓ చిన్న కుక్క పిల్లను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. కుక్కకు స్టెఫీ అని పేరు పెట్టుకుని ఇంట్లో మనిషిగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం స్టెఫీ గర్భంతో ఉంది. దీంతో స్టెఫీకి ఘనంగా సీమంతం జరిపించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న స్టెఫీ శ్రీమంతానికి బంధు, మిత్రులను ఆహ్వానించారు.వారందరికి విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఫంక్షన్ కు వచ్చిన మహిళలు స్టెఫీకి మంగళ హారతులు ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tags andrapradesh baby ceremony dog love INDIA khammam parents social media telangana virus